Saturday, December 30, 2006

అసంపూర్ణ కవిత


నిను రోజూ చూసినా
నడిరేయిదాకా కునుకే రాని నాకు
ఈ రోజు నిద్దురే లేదు
నిన్నసలు చూన్నేలేదనేమో

అలాగే ఆలోచిస్తూ కూర్చున్నా
గతం చెప్పిన ఊసుల్ని గాల్లోనే చూస్తూ!...

*** *** *** ***
ఉదయిస్తే మైదానం
అస్తమిస్తే మైదానం
పగలంతా మిత్రులతో
పనికిరాని ముచ్చట్లకు బలిదానం.

బాధలెన్ని ఉన్నా బాధ్యతలెన్ని ఉన్నా
సరదాగానే సాగింది నా జీవనం.

కళ్ళ నిండా క్రికెట్.
పగటి కలలనిండా క్రికెట్.
క్రికెట్ అంత పిచ్చిగా వేరే తలచినట్టు
నాకు జ్ఞాపకమే లేదు నీమీద ఒట్టు.

ఒంటరితనం నను కదిపినప్పుడల్లా
నా మదిలోని భావాలకు
కుంచెతో ప్రాణం పోసి
కలంతో కదలిక నిచ్చేవాన్ని.

కళ్ళముందే కాలం
కలలా కరిగిపోతుంటే
నా ఆశలు,ఆశయాలు
తీరేదెలా అని ఆలోచించేవాన్ని.

ఏదో సాధించాలని ఉన్నా
గమ్యం తెలియని లక్ష్యం.
ఎంతో చదవాలని ఉన్నా
చదువడమంటే నిర్లక్ష్యం.

కానీ;
వాటికి నే తపించినప్పుడల్లా
అదృష్టం వెక్కిరించేది
అవమానమే పలకరించేది.
అడుగు ముందుకేస్తే పదడుగులు వెనక్కి లాగే
మధ్యతరగతి జీవనం కన్నీళ్ళు తెప్పించేది.

అందుకేనేమో;
ప్రయత్నించి బాధపడటంకన్నా
జరిగేదో చూస్తూ ఉండటం మిన్న!
అయ్యేదేదో కాకపోదు,రాసిపెట్టంది కానేకాదు.
అని నా మనసును కట్టి పడేసుకున్నా!!

యిలా నా జీవితం
నవ్వుతూ,ఏడుస్తూ
పడుతూ లేస్తూ
నింగికెగిరిన గాలిపటంలాసాగుతూనే ఉందలా....

*** *** *** ***
అనుకున్నానప్పుడు
నా జీవితం యిక యిలానే శాశ్వతం.
కానీ, నాకు తెలియదు ఓ నవవసంతం
విరబూయబోతోందని ఆ సాయంత్రం!

(సశేషం)17/01/2002/.

No comments: