Saturday, December 30, 2006

అసంపూర్ణ కవిత


నిను రోజూ చూసినా
నడిరేయిదాకా కునుకే రాని నాకు
ఈ రోజు నిద్దురే లేదు
నిన్నసలు చూన్నేలేదనేమో

అలాగే ఆలోచిస్తూ కూర్చున్నా
గతం చెప్పిన ఊసుల్ని గాల్లోనే చూస్తూ!...

*** *** *** ***
ఉదయిస్తే మైదానం
అస్తమిస్తే మైదానం
పగలంతా మిత్రులతో
పనికిరాని ముచ్చట్లకు బలిదానం.

బాధలెన్ని ఉన్నా బాధ్యతలెన్ని ఉన్నా
సరదాగానే సాగింది నా జీవనం.

కళ్ళ నిండా క్రికెట్.
పగటి కలలనిండా క్రికెట్.
క్రికెట్ అంత పిచ్చిగా వేరే తలచినట్టు
నాకు జ్ఞాపకమే లేదు నీమీద ఒట్టు.

ఒంటరితనం నను కదిపినప్పుడల్లా
నా మదిలోని భావాలకు
కుంచెతో ప్రాణం పోసి
కలంతో కదలిక నిచ్చేవాన్ని.

కళ్ళముందే కాలం
కలలా కరిగిపోతుంటే
నా ఆశలు,ఆశయాలు
తీరేదెలా అని ఆలోచించేవాన్ని.

ఏదో సాధించాలని ఉన్నా
గమ్యం తెలియని లక్ష్యం.
ఎంతో చదవాలని ఉన్నా
చదువడమంటే నిర్లక్ష్యం.

కానీ;
వాటికి నే తపించినప్పుడల్లా
అదృష్టం వెక్కిరించేది
అవమానమే పలకరించేది.
అడుగు ముందుకేస్తే పదడుగులు వెనక్కి లాగే
మధ్యతరగతి జీవనం కన్నీళ్ళు తెప్పించేది.

అందుకేనేమో;
ప్రయత్నించి బాధపడటంకన్నా
జరిగేదో చూస్తూ ఉండటం మిన్న!
అయ్యేదేదో కాకపోదు,రాసిపెట్టంది కానేకాదు.
అని నా మనసును కట్టి పడేసుకున్నా!!

యిలా నా జీవితం
నవ్వుతూ,ఏడుస్తూ
పడుతూ లేస్తూ
నింగికెగిరిన గాలిపటంలాసాగుతూనే ఉందలా....

*** *** *** ***
అనుకున్నానప్పుడు
నా జీవితం యిక యిలానే శాశ్వతం.
కానీ, నాకు తెలియదు ఓ నవవసంతం
విరబూయబోతోందని ఆ సాయంత్రం!

(సశేషం)17/01/2002/.

"ఒడ్డునపడ్డ చేప"

Friday, December 29, 2006

"ఊహా ప్రేయసికి కందమాల "

"అసమర్థుని జీవయాత్ర"

"త్రిపురనేని గోపీచంద్ "

"నిన్ను చూస్తుంటే"

Wednesday, December 06, 2006

కాలం!

కాలమెపుడూ పరిగెడుతూనే వుంటుంది.
నువ్వు విశ్రాంతి తీసుకుంటానంటే
తనాగిపోదు.
కాలమెపుడూ మారుతూనే వుంటుంది.
నువ్వు ఒకేలా వుంటానంటే
తనూరుకోదు.
కాలమెపుడూ ముందుకే పయనిస్తుంటుంది.
నువ్వు గతపు తీపి జ్ఞాపకాల్లోనే జీవిస్తానంటే
తను సహించదు.

కాలమిన్ని చెప్పినా నువ్వు లెక్క చేయక,
కలకాలం యిలానే ఉంటానంటే,
నీ సమకాలం నిన్ను వెలేస్తుంది!
నీ సమాజం నిన్ను బలిస్తుంది!

అందుకే;
మాటాడగలిగీ మాటాడలేని,
చెప్పగలిగీ చెప్పలేని,
చేయగలిగీ చేయలేని,
ఓ సమర్థాసమర్థ యువకా!

కాలంతో సాగిపో!
కాలంలా మారిపో!
ప్రతి కాలంలో నిలిచిపో!!

Saturday, December 02, 2006

నిత్య ప్రేరకునికి నివాలి



ఓ ప్రభూ!
ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను,
ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో....

నా స్వామీ!
నన్ను నీలో చేర్చుకోవూ!
నీ గుండెల నిండా అదుముకోవూ!
నీవు విహరిస్తున్న సత్యలోకపు ఛాయలకైనా నన్ను తీసుకెళ్ళవూ!!
ఈ అశాంతి జ్వలిత విశ్వం నుండి ప్రశాంతికై కలవరిస్తున్న అంధుడిని.
నీ అమృత వాక్కుల వెలుగుల బాటలోకి నన్నూ పయనింప చేయవూ!

ఓ యోధుడా!
నీ కళ్ళల్లో కాంతిని చూసాను.
ఎన్ని వెలుగులు విరజిమ్మితేనేం,

ఆ చుక్కలన్నీ నీ ముందు తల దించుకోలేదా!
విశ్వ మర్మమెరిగిన నీ నవ్వును చూసాను.
ఏ మోనాలిసా నా కళ్ళకు తట్టలేదే!
అది చిత్తరువైతేనేం,
ప్రాపంచిక వాంఛలతో నిండిపాపపు పనులెన్నో చేసిన
ఈ అపవిత్రపు చేతులతో నీ బుగ్గలను తాకాను,
అంతే!ఇన్నాళ్ళ నా మోసం,స్వార్థం,ద్వేషం,కుట్ర....
అన్నీ వేళ్ళతో సహా లాగేస్తున్నట్లు
ఒళ్ళు జలదరించిన అనుభవం ఎలా మరిచిపోగలను.

ఓ వీరుడా!
భయపడొద్దంటావ్.
ఓ గురువా!
బాధ్యతలన్నినా పైనే వేస్తావ్.
ఓ నిత్య ప్రేరకా!
నను నిరంతరం మేల్కొలుపుతుంటావ్.
ఓ యోగీ!
ధ్యానమే నీ జీవనయానమంటావ్.
ఓ మౌనీ!
నిశ్శబ్దమే బంగారమంటావ్.

వేలకోట్ల సంవత్సరాల నా సంస్కృతి శక్తులు
మూర్తీభవించిన ఓ సంపూర్ణ భారత యువకా!
నీవు నాడు దేశదేశాల్లోనాటిన నా భారత కీర్తి పతాక
నేటికీ విశ్వ వినీలాకాశంలోగర్వంగా రెపరెపలాడుతూనే వుంది.

విశ్వ మతాల సారాన్ని గ్రహించి,
దివ్యతేజస్సుతో ప్రకాశించిన ఓ ప్రవర్తకా!
నీవు నాడు ప్రతి భారత యువకుని గుండెల్లోనింపిన అమృత సందేశాలు
నేటికీ కడలి తరంగాలైఅనునిత్యం ఘోషిస్తూనే వున్నాయి.

ఓ మహాత్మా! మహితాత్మా!!
ఓ వ్యక్తీ!శక్తీ!!
ఓ నరేంద్రుడా! వివేకానందుడా!!
మళ్ళీ రావా!
నా సంస్కృతి గొప్పదనాన్నిఈ విశ్వ జనులందరికీ చాటడానికి.
మళ్ళీ రావా!
నా సంస్కృతి వృక్షాన్నిఈ చెదలు బారినుండి రక్షించడానికి.

అందుకే నా దైవమా!
ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను
ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో....

Friday, December 01, 2006

ఎడారి


పేదవాడి జీవితమే ఎడారి.
యిసుక తుఫానులా ఆర్థిక వ్యవస్థ తరిమి తరిమి కొడుతుంటే,
కష్టాలనే ముళ్ళు కసిదీరా కుచ్చుతుంటే,
బాధ్యతలనే ఎండలు తనువులోని రక్తమంతా పీల్చేస్తుంటే,

ఎంత నడిచినా,ఎటు చూసినా,
కనీసం పేదరికపు హద్దులనైనా చూడలేక
ఉరితాడుతోనో,రైలు పట్టాలపైనో
మధ్య లోనే కుప్పకూలే అనాథ శవాలెన్నెన్నో....

Wednesday, November 01, 2006

గిల్టీ ఫీలింగ్

అనుకుంటూనేవున్నా!
నీ దగ్గరితనంఎంతగా దూరం చేస్తోంది నన్ను నా నుంచి!!

నిజం సుమా!
నీవుంటే చాలు ఏమైనా సాధిస్తానన్న భ్రమల్లోంచి
నీవున్నావు కాబట్టే యిలా అయ్యానన్న వాస్తవంలోకి చూస్తుంటే....
ఏమీ అనాలని అనిపించట్లేదు!
నవ్వు,ఏడుపు,కోపం....
అన్నీ కలగలిసి వుండడం ఎప్పుడైనా చూసావా?
నన్ను చూడిప్పుడు.
యిక మరేం చేయను.

నాకు తెలుసు!
నువ్వు కావాలనేం చేయలేదని.
నాకు తెలుసు!
నేను కావాలనుకున్నదేదీ చేయట్లేదని.

నా గతమెప్పుడుగుర్తు తెచ్చుకోవద్దనే ప్రయత్నిస్తాను,
కానీ ఒక్కోసారి గుర్తుకొస్తాయి.
నేనొచ్చిన పరిస్థితులు....

కన్నీళ్ళతో పోరాటాలు,
ఓదార్పుకై ఆరాటాలు,
ఊహల్లో రంగు రంగుల కలలు,
అవి నిజం కావాలని నిర్ణయించుకున్న లక్ష్యాలు,
కళ్ళముందు తెరలు తెరలుగా కదులుతున్నప్పుడల్లా
ఏదో గిల్టీ ఫీలింగ్,
మోసం చేస్తున్నానన్న భావన.

ఎవరినో చేస్తున్నాననిపిస్తే అంత బాధ వుండేది కాదేమో.
అమ్మని,నిజంగా అమ్మని....
అలుపెరగని అమ్మ ప్రేమని....
బ్రతుకునే కాదు,బ్రతుకు దారినీ యిచ్చిన అమ్మ ప్రేమని....