Saturday, December 02, 2006

నిత్య ప్రేరకునికి నివాలి



ఓ ప్రభూ!
ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను,
ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో....

నా స్వామీ!
నన్ను నీలో చేర్చుకోవూ!
నీ గుండెల నిండా అదుముకోవూ!
నీవు విహరిస్తున్న సత్యలోకపు ఛాయలకైనా నన్ను తీసుకెళ్ళవూ!!
ఈ అశాంతి జ్వలిత విశ్వం నుండి ప్రశాంతికై కలవరిస్తున్న అంధుడిని.
నీ అమృత వాక్కుల వెలుగుల బాటలోకి నన్నూ పయనింప చేయవూ!

ఓ యోధుడా!
నీ కళ్ళల్లో కాంతిని చూసాను.
ఎన్ని వెలుగులు విరజిమ్మితేనేం,

ఆ చుక్కలన్నీ నీ ముందు తల దించుకోలేదా!
విశ్వ మర్మమెరిగిన నీ నవ్వును చూసాను.
ఏ మోనాలిసా నా కళ్ళకు తట్టలేదే!
అది చిత్తరువైతేనేం,
ప్రాపంచిక వాంఛలతో నిండిపాపపు పనులెన్నో చేసిన
ఈ అపవిత్రపు చేతులతో నీ బుగ్గలను తాకాను,
అంతే!ఇన్నాళ్ళ నా మోసం,స్వార్థం,ద్వేషం,కుట్ర....
అన్నీ వేళ్ళతో సహా లాగేస్తున్నట్లు
ఒళ్ళు జలదరించిన అనుభవం ఎలా మరిచిపోగలను.

ఓ వీరుడా!
భయపడొద్దంటావ్.
ఓ గురువా!
బాధ్యతలన్నినా పైనే వేస్తావ్.
ఓ నిత్య ప్రేరకా!
నను నిరంతరం మేల్కొలుపుతుంటావ్.
ఓ యోగీ!
ధ్యానమే నీ జీవనయానమంటావ్.
ఓ మౌనీ!
నిశ్శబ్దమే బంగారమంటావ్.

వేలకోట్ల సంవత్సరాల నా సంస్కృతి శక్తులు
మూర్తీభవించిన ఓ సంపూర్ణ భారత యువకా!
నీవు నాడు దేశదేశాల్లోనాటిన నా భారత కీర్తి పతాక
నేటికీ విశ్వ వినీలాకాశంలోగర్వంగా రెపరెపలాడుతూనే వుంది.

విశ్వ మతాల సారాన్ని గ్రహించి,
దివ్యతేజస్సుతో ప్రకాశించిన ఓ ప్రవర్తకా!
నీవు నాడు ప్రతి భారత యువకుని గుండెల్లోనింపిన అమృత సందేశాలు
నేటికీ కడలి తరంగాలైఅనునిత్యం ఘోషిస్తూనే వున్నాయి.

ఓ మహాత్మా! మహితాత్మా!!
ఓ వ్యక్తీ!శక్తీ!!
ఓ నరేంద్రుడా! వివేకానందుడా!!
మళ్ళీ రావా!
నా సంస్కృతి గొప్పదనాన్నిఈ విశ్వ జనులందరికీ చాటడానికి.
మళ్ళీ రావా!
నా సంస్కృతి వృక్షాన్నిఈ చెదలు బారినుండి రక్షించడానికి.

అందుకే నా దైవమా!
ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను
ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో....

No comments: