Wednesday, November 01, 2006

గిల్టీ ఫీలింగ్

అనుకుంటూనేవున్నా!
నీ దగ్గరితనంఎంతగా దూరం చేస్తోంది నన్ను నా నుంచి!!

నిజం సుమా!
నీవుంటే చాలు ఏమైనా సాధిస్తానన్న భ్రమల్లోంచి
నీవున్నావు కాబట్టే యిలా అయ్యానన్న వాస్తవంలోకి చూస్తుంటే....
ఏమీ అనాలని అనిపించట్లేదు!
నవ్వు,ఏడుపు,కోపం....
అన్నీ కలగలిసి వుండడం ఎప్పుడైనా చూసావా?
నన్ను చూడిప్పుడు.
యిక మరేం చేయను.

నాకు తెలుసు!
నువ్వు కావాలనేం చేయలేదని.
నాకు తెలుసు!
నేను కావాలనుకున్నదేదీ చేయట్లేదని.

నా గతమెప్పుడుగుర్తు తెచ్చుకోవద్దనే ప్రయత్నిస్తాను,
కానీ ఒక్కోసారి గుర్తుకొస్తాయి.
నేనొచ్చిన పరిస్థితులు....

కన్నీళ్ళతో పోరాటాలు,
ఓదార్పుకై ఆరాటాలు,
ఊహల్లో రంగు రంగుల కలలు,
అవి నిజం కావాలని నిర్ణయించుకున్న లక్ష్యాలు,
కళ్ళముందు తెరలు తెరలుగా కదులుతున్నప్పుడల్లా
ఏదో గిల్టీ ఫీలింగ్,
మోసం చేస్తున్నానన్న భావన.

ఎవరినో చేస్తున్నాననిపిస్తే అంత బాధ వుండేది కాదేమో.
అమ్మని,నిజంగా అమ్మని....
అలుపెరగని అమ్మ ప్రేమని....
బ్రతుకునే కాదు,బ్రతుకు దారినీ యిచ్చిన అమ్మ ప్రేమని....